హైదరాబాద్, వెలుగు: ఆయిల్‌పామ్ రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ లైన్ల సమస్యకు పరిష్కారం చూపే దిశగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రతిపాదన చేశారు. ఆయిల్‌పామ్ తోటల మధ్య నుంచి వెళ్తున్న 11 కేవీ, ఎల్టీ బహిరంగ విద్యుత్ తీగల స్థానంలో ఏబీ కేబుల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు. విద్యుత్ లైన్ల కారణంగా ఆయిల్‌పామ్ తోటల్లో ఎకరాకు 6 నుంచి 8 మొక్కల వరకు నాటలేక రైతులు ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కనకాపూర్‌లో 4.5 ఎకరాల తోట మధ్య నుంచి 150 మీటర్ల మేర 11 కేవీ లైన్ వెళ్లడంతో 20 మొక్కలు నాటలేని పరిస్థితి ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
ఈ మొక్కల ద్వారా 35 ఏండ్లలో దాదాపు రూ.27.45 లక్షల స్థూల ఆదాయం వచ్చే అవకాశం ఉండగా, విద్యుత్ లైన్‌ను ఏబీ కేబుల్‌గా మార్చేందుకు రూ.1.45 లక్షలే ఖర్చవుతుందని అంచనా వేశామని తెలిపారు.
